: ఐదర్ మోటార్స్ పేరిట భారీ మోసం!... డీలర్ షిప్పుల పేరిట వందల కోట్లు వసూలు చేసిన మాయగాడు!
తెలుగు నేలపై మరో భారీ మోసం వెలుగు చూసింది. చైనాలో తయారయ్యే వాహనాల విక్రయం కోసం డీలర్ షిప్పులను ఇస్తానని చెప్పిన ఓ నయ వంచకుడు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పదుల సంఖ్యలో వ్యాపారుల నుంచి వందలాది కోట్లు సేకరించాడు. ఆపై వాహనాలను అందించకుండానే ఉడాయించాడు. ఈ క్రమంలో మోనపోయామంటూ బాధిత వ్యాపారులు పోలీస్ స్టేషన్లకు క్యూ కట్టారు. వెరసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ నయ వంచకుడిపై పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఎట్టకేలకు రంగంలోకి దిగిన తెలంగాణ సీసీఎస్ పోలీసులు మోసగాడిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకెళితే... శివకుమార్ అనే వ్యక్తి ‘ఐదర్ మోటార్స్’ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. అత్యధిక సామర్థ్యంతో కూడిన వాహనాలను అతి తక్కువ ధరకే అందిస్తున్న చైనా కంపెనీలకు చెందిన వాహనాల విక్రయాల కోసం డీలర్ షిప్పుల కోసం ప్రకటనలిచ్చాడు. చైనా వాహనాలనగానే క్యూ కట్టిన పలువురి వద్ద కోట్లాది రూపాయలను డిపాజిట్ చేయించుకున్న శివకుమార్ ఆ తర్వాత పత్తా లేకుండా పోయాడు. జరిగిన మోసంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం తమ అదుపులో ఉన్న శివకుమార్ ను విచారిస్తున్న పోలీసులు... అతడు నెరపిన దందాను వెలికి తీసే యత్నం చేస్తున్నారు.