: పవన్ కల్యాణ్ పై రోజా విసుర్లు!... జనసేనానిది అవగాహనా రాహిత్యమేనని ధ్వజం!
టాలీవుడ్ అగ్ర నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా మరోమారు విరుచుకుపడ్డారు. ఏపీ అసెంబ్లీ వాయిదా అనంతరం అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు నిరసనకు దిగిన వైసీపీ అధినేత వైెఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి ఫుట్ పాత్ పై కూర్చుని రోజా ఆందోళన చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ తీరుపై ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ అవగాహనా రాహిత్యంతోనే మాట్లాడారని రోజా ఆరోపించారు. పవన్ కల్యాణ్ ది చిన్న పిల్లల మనస్తత్వం అని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్... మోదీ, చంద్రబాబులను ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రజలను పవన్ కల్యాణ్ తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఏపీ ప్రజల చెవిలో కేంద్రం పూలు పెట్టిందని ఆమె విరుచుకుపడ్డారు. టీడీపీ, బీజేపీల మేనిఫెస్టోలను చూడకుండానే పవన్ కల్యాణ్ ఆ పార్టీలకు మద్దతుగా ప్రచారం చేశారా? అని ఆమె ప్రశ్నించారు.