: ప్రత్యేక తెలంగాణ సాధ్యం కాదు అనుకున్నారు.. సాధించుకోలేదా? ‘హోదా’ కూడా అంతే!: జగన్
ప్రత్యేక తెలంగాణ సాధ్యం కాదు అనుకున్నారు.. సాధించుకోలేదా? అని వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడిన అనంతరం జగన్ గాంధీ విగ్రహం వద్ద తమ పార్టీ నేతలతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రాన్ని ఏళ్ల తరబడి సాధించుకున్నట్లే హోదాను కూడా పోరాడి సాధించుకుందాం అని ఆయన పిలుపునిచ్చారు. కేసుల నుంచి బయటపడేందుకే చంద్రబాబు రాజీ పడ్డారని జగన్ ఆరోపించారు. పార్లమెంటులోనే హోదా ఇస్తామని చెప్పారని జగన్ అన్నారు. పోరాటం చేయడానికి వెనకడుగు వేయడం మంచి పద్ధతి కాదు.. పోరాడుతూనే ఉండాలని వ్యాఖ్యానించారు. హోదా ఎవరిస్తారని చెబుతారో వారికే మనం కేంద్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మద్దతివ్వాలని అన్నారు. హోదా కోసం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ పోరాడాలని పేర్కొన్నారు. టీడీపీ నేతలు రాష్ట్రప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు. జైట్లీ ప్రకటనను సీఎం స్వాగతించడం ఏపీ చరిత్రలోనే చీకటి రోజని పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకే బాబు ప్రయత్నాలు చేస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఐదున్నర కోట్ల మండి ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టారని అన్నారు. హోదాపై చంద్రబాబు దారుణంగా అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. హోదా వస్తే లక్షల కోట్ల పెట్టుబడులు, వేలాది ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. అన్నీ తెలిసికూడా చంద్రబాబు నాటకాలాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో చర్చ జరపాలని మేము డిమాండ్ చేస్తుంటే ప్రకటన మాత్రమే చేస్తామని చెబుతున్నారని ఆయన అన్నారు. సీఎం హోదాలో ఉండి కేంద్రాన్ని చంద్రబాబు ప్రశ్నించకపోవడం దారుణమని జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిపక్షం గొంతు వినాలని ఆయన హితవు పలికారు. హోదా కోసం ప్రజలు బంద్‌లో పాల్గొంటుంటే విఫలం చేసేందుకు ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. సీఎం రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అందరి సహకారం తమకు కావాలని కోరారు. పోరాటాన్ని ఆపబోమని ఉద్ఘాటించారు.