: సభను నిరవధికంగా వాయిదా వేసిన స్పీకర్!
మూడు రోజుల పాటు జరిగిన ఏపీ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. ఈ మేరకు స్పీకర్ కోడెల శివప్రసాద్ కొద్దిసేపటి క్రితం వైసీపీ సభ్యుల నిరసనల మధ్యే సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలపడమే ప్రధాన లక్ష్యంగా మూడు రోజుల క్రితం ప్రారంభమైన సభలో ఆది నుంచి వైసీపీ నిరసనలు కొనసాగాయి. ఏ ఒక్క రోజు కూడా సభ సజావుగా సాగలేదు. మూడు రోజులూ నల్ల రంగు చొక్కాలతోనే సభకు వచ్చిన వైసీపీ సభ్యులు ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చకు డిమాండ్ చేశారు. మూడు రోజులూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి సభను స్తంభింపజేశారు. ఈ క్రమంలో వైసీపీ సభ్యులపై నేటి సమావేశాల్లో భాగంగా చర్యలు తప్పవన్న భావన వ్యక్తమైంది. ఈ మేరకు మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ, బీజేపీ సభ్యులు వైసీపీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పీకర్ ను కోరారు. అయితే వైసీపీ సభ్యులపై చర్యలు తీసుకోకుండానే స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేసేశారు.