: మోదీ పనితీరుపై ర్యాంకు ఇస్తే వివాదం అవుతుంది.. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు: బాబా రాందేవ్


ప్రధాని నరేంద్రమోదీ పనితీరుపై రేటింగ్ ఇచ్చి వివాదాన్ని కొని తెచ్చుకునే ఉద్దేశం లేదని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదన్నారు. ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, తుది శ్వాస విడిచే వరకు ఇదే మాటపై ఉంటానన్నారు. దేశానికి మంచి నేతలు ఉండాలని, స్థిరమైన రాజకీయ వ్యవస్థ ఉండాలనేదే తన అభిమతమని పేర్కొన్నారు. తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటే పార్టీనే స్థాపించగలనని, తనకు వందమంది ప్రముఖ నేతల మద్దతు ఉందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తాను చేసిందంతా ప్రజాసేవ కోసమేనన్న బాబా, ప్రజలే తనకు పేరుప్రఖ్యాతులు ఇచ్చారన్నారు. ప్రధానితో తనకు చాలా సాన్నిహిత్యం ఉన్నా తానెప్పుడూ సొంత ప్రయోజనాల కోసం దానిని వాడుకోలేదన్నారు. విదేశాల నుంచి నల్లధనాన్ని వెనక్కి తెప్పించేందుకు ప్రభుత్వం మరింత కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వానికి ఏవైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే నేరుగా మోదీ, అమిత్‌ షాకే ఇస్తానని, రోడ్డుపై పడి గగ్గోలు పెట్టనని నవ్వుతూ చెప్పారు. ప్రస్తుతం తన దృష్టంతా యోగా, ఆయుర్వేద, వేద విద్య, సేవలపైనే ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గోరక్ష పేరుతో వ్యాపిస్తున్న ఉగ్రవాదాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని బాబా రాందేవ్ అన్నారు. పతంజలి ఉత్పత్తుల విజయం గురించి మాట్లాడుతూ పారదర్శకత, జవాబుదారీ తనం, బాధ్యత.. ఈ మూడే తన విజయరహస్యాలని పేర్కొన్నారు. బహుళ జాతి సంస్థలు ప్రకటనల రూపంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయని, కానీ తానే స్వయంగా కెమెరా ముందుకు వచ్చి మా ఉత్పత్తుల గురించి చెబుతున్నానని అన్నారు. ప్రజలకు తాను రెండున్నర దశాబ్దాలుగా తెలుసునని, తాను నేలపైనే నిద్రిస్తానన్న విషయం కూడా వారికి తెలుసని అన్నారు. నా గురించి నేనేమీ దాచుకోనన్న నమ్మకం ప్రజలకు ఉందని రాందేవ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News