: మరోమారు రక్తమోడిన ఇరాక్.. బాగ్దాద్ కారుబాంబు పేలుడులో ఏడుగురి దుర్మరణం
ఇరాక్ రాజధాని బాగ్దాద్ మరోమారు రక్తమోడింది. నిత్యం రద్దీగా ఉండే రాజధానిలోని నఖీల్ షాపింగ్‌మాల్ వద్ద శుక్రవారం రాత్రి పొద్దుపోయాక కారు బాంబు పేలింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలవగా 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిపై ఇప్పటి వరకు ఉగ్రవాద సంస్థలు ప్రకటన చేయలేదు. అయితే ఇక్కడి పౌరులను లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తరచూ దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉగ్రవాదులపై పోరాటానికి ఇరాక్‌కు అమెరికా సాయం అందిస్తుండడంతో పట్టుకోల్పోయిన ఇస్లామిక్ స్టేట్ తరచూ ఇటువంటి ఘటనలతో తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తోందని ఓ అధికారి పేర్కొన్నారు.