: మళ్లీ అదే తీరు! లంచం అడిగిన అంబులెన్స్ డ్రైవర్.. బైక్‌పైనే మృతదేహాన్ని తీసుకెళ్లిన బాధితులు
మృతదేహాన్ని తరలించేందుకు ప్రభుత్వ అంబులెన్స్ డ్రైవర్ రూ.1500 డిమాండ్ చేయడంతో అంత చెల్లించుకోలేని బాధితులు మృతదేహాన్ని బైక్‌పైనే తరలించిన ఘటన పలువురితో కంటతడి పెట్టించింది. గత రెండు వారాల్లో ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో ఇటువంటివి మూడు ఘటనలు వెలుగుచూసినా ప్రభుత్వ అంబులెన్స్ డ్రైవర్లలో ఏమాత్రం మార్పు రాలేదనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్ జిల్లా హర్పాల్‌పూర్ నగ్రియా గ్రామానికి చెందిన రీస్పాల్(40) గత కొంతకాలంగా టీబీ వ్యాధితో బాధపడుతున్నాడు. మంగళవారం అతడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో సోదరుడు ఓంకార్ స్థానిక హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లాడు. రీస్పాల్‌ను పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో అక్కడికి తీసుకెళ్లారు. అయితే రీస్పాల్ అప్పటికే మృతిచెందినట్టు జిల్లా ఆస్పత్రి వైద్యులు చెప్పారు. అన్న మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఓంకార్ ప్రభుత్వ అంబులెన్స్ డ్రైవర్‌ను కలిశాడు. అతడు రూ.1500 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంతమొత్తం అతడి వద్దలేకపోవడంతో బైక్‌పైనే అన్న మృతదేహాన్ని తీసుకెళ్లాడు. దీనిని చూసిన కొందరు గ్రామస్తులు రూ.500 ఇవ్వడంతో ప్రైవేటు అంబులెన్స్‌ను మాట్లాడి అందులో తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో శుక్రవారం వాట్సాప్‌లో ప్రత్యక్షం కావడంతో వైరల్ అయింది.ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ విజయేంద్ర పాండ్యన్ మాట్లాడుతూ బాధితులు ఎవరూ ప్రభుత్వ అంబులెన్స్‌ను సంప్రదించలేదని తెలిపారు. వారు నేరుగా ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్‌తోనే మాట్లాడుకున్నారని తెలిపారు.