: డిసెంబర్ లో యువీ వివాహం!... స్వయంగా ప్రకటించిన టీమిండియా క్రికెటర్!
టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ త్వరలోనే ఓ ఇంటి వాడు కానున్నాడు. నటి హాజెల్ కీచ్ తో ప్రేమాయణం మొదలెట్టిన యువీ... గతేడాది నవంబర్ లో రహస్యంగా ఆమెతో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. ఇండోనేసియాలోని బాలి ద్వీపంలో జరిగిన ఈ ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫొటోలను ఆ తర్వాత యువీనే విడుదల చేశాడు. తాజాగా తన పెళ్లిపై అతడు నిన్న కీలక ప్రకటన చేశాడు. డిసెంబర్ మొదటి వారంలో హాజెల్ తో తన పెళ్లి జరగనున్నట్లు అతడు పేర్కొన్నాడు. అయితే ఇంకా తేదీ ఖరారు కాలేదని పేర్కొన్న అతడు త్వరలోనే తేదీని కూడా ప్రకటిస్తానన్నాడు. ఇదిలా ఉంటే డిసెంటర్ 12న యువీ పుట్టిన రోజు కావడంతో, అదే రోజున అతడి వివాహాన్ని జరిపించాలని అతడి తల్లి భావిస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ‘‘దుబాయిలో పంజాబీ సంప్రదాయం ప్రకారం హాజెల్ ను పెళ్లి చేసుకోబోతున్నాను. ఢిల్లీలో రిసెప్షప్ ఉంటుంది. హాజెల్ తల్లి ఉత్తరప్రదేశ్ కు చెందిన వారు అయిన నేపథ్యంలో యూపీ సంప్రదాయం ప్రకారం కూడా పెళ్లి వేడుకలు జరుగుతాయి’ అని యువీ పేర్కొన్నాడు.