: పేర్లు పెట్టడం ద్వారా ఆరు నెలల్లో 42 లక్షలు సంపాదించిన అమ్మాయి!
'వాటీజ్ ఇన్ నేమ్?' అన్నది నానుడి. అయితే, అంతా పేరులోనే వుందంటోంది, బ్రిటన్ కు చెందిన బ్యు జెసప్ (16). చైనీయులకు పేర్లు పెట్టడం ద్వారా ఈ అమ్మాయి కేవలం 6 నెలల్లోనే 42 లక్షల రూపాయలు సంపాదించిందంటే నమ్మశక్యం కాదు. కానీ ఇది వాస్తవం. ఆ వివరాల్లోకి వెళ్తే... ఆరు నెలల క్రితం బ్యూసెప్ అనే హైస్కూలు విద్యార్థిని తల్లిదండ్రులతో కలసి చైనా పర్యటనకు వెళ్లింది. అక్కడ కొందరి పేర్లు పలకడానికి ఇబ్బందిగా ఉండడాన్ని ఆమె గుర్తించింది. ఇందులో కొన్ని రాసేందుకు కూడా అనువుగాలేవు. దీంతో కొంత మంది పిల్లలకు పలికేందుకు అనువుగా సిండ్రెల్లా, మేరీ, అలెగ్జాండర్ వంటి పేర్లు పెట్టింది. ఇలా వారి పేర్లు మార్చుకోవాల్సిన అవసరం గురించి వారికి వివరించింది. అంతే కాకుండా పర్యటన ముగిసిన అనంతరం బ్రిటన్ వెళ్లి, సొంతంగా 'స్పెషల్ నేమి.సిఎన్' అనే వెబ్ సైట్ ను స్థాపించింది. దీంతో యూకేలోని విశ్వవిద్యాలయాల్లో చేరే చైనీయులు తమ పేర్లు రాసేందుకు, పలికేందుకు ఇబ్బందులు ఉండడంతో, కొంత మంది జెసప్ ను సంప్రదించి పేర్లు పెట్టమంటున్నారు. వారికి అర్థవంతమైన పేర్లు పెడుతూ, జెసప్ వ్యాపారం పెంచుకుంటోంది. అలాగే ఈ మెయిల్ విషయంలో కూడా చైనీయుల పేర్లను కంప్యూటర్లు సపోర్ట్ చేయకపోవడంతో ఇంగ్లీషు పేర్లు కావాలనుకునే చైనీయుల సంఖ్య పెరుగుతోంది. అందుకు తగ్గట్టే కన్సల్టేషన్ ఫీజు వసూలు చేస్తూ, జెసప్ రెండు చేతులా సంపాదిస్తోంది.