: పవన్ కల్యాణ్ ప్రసంగంపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ జేఎన్టీయూ గ్రౌండ్ లో జరిగిన సభలో జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. కొద్ది సేపటిక్రితం ఆయన మీడియాతో మాట్లాడుతూ... జనసేనాని అన్నీ వాస్తవాలే మాట్లాడారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తే అందరికన్నా ఎక్కువగా సంతోషించేది తానేనని ఆయన అన్నారు. హోదా వస్తే రాష్ట్రానికి అనేక అంశాల్లో వెసులుబాటు వస్తుందని వ్యాఖ్యానించారు. రెండు రోజులుగా ఏపీ శాసనసభలో ప్రతిపక్ష వైసీపీ తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. సభాపతిపై వైసీపీ నేతలు ప్రదర్శించిన తీరును ఆయన ఖండించారు. హద్దులు దాటి గందరగోళం సృష్టించారని అన్నారు. వైసీపీ అధినేతది ఉన్మాద చర్య అని ఆయన పేర్కొన్నారు. జగన్ నాయకత్వం వల్లే వైసీపీ సభ్యులు ఇటువంటి చర్యలకు దిగుతున్నారని ఆయన అన్నారు. హోదా కోసం ప్రతిపక్షాలు రేపు రాష్ట్ర బంద్‌కి పిలుపునిచ్చిన అంశంపై చంద్రబాబు స్పందిస్తూ.. బంద్ నిర్వహిస్తే ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలని మరింత ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. బంద్‌కు ప్రజలు సహకరించొద్దని కోరారు.