: కారం తిని వెళ్లి పార్లమెంటులో పోరాటం చేయండి: ఏపీ ఎంపీలకు పవన్ సలహా
ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కారం తిని పార్లమెంటుకు వెళ్లి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని కాకినాడలో జనసేనాని, సినీనటుడు పవన్ కల్యాణ్ సూచించారు. ఆంధ్రనాయకుల్లో పౌరుషం ఏమయిందని ఆయన ప్రశ్నించారు. కారం తింటే వస్తుందని సూచించారు. ‘టీజీ వెంకటేష్ గారు నన్ను కుంభకర్ణుడన్నారు. మీ మీద, తెలుగు దేశం ప్రభుత్వం మీద నేను కూడా మాట్లాడగలను. మీరు నడుపుతున్న సంస్థలపై మాట్లాడగలను. మీరు నాకు రాజకీయాల గురించి చెప్పవద్దు. అవకాశవాద రాజకీయాలు నేను చేయట్లేదు’ అని పవన్ అన్నారు. ‘మీరెంత సంస్కారహీనమైన మాటలు మాట్లాడినా నేను సంస్కారయుతంగా మాట్లాడుతున్నా. మిమ్మల్ని కుర్చీలు ఎక్కిస్తే మీరు మమ్మల్నే వెక్కిరిస్తున్నారా? చాలా గొప్పగా వెంకయ్య నాయుడు ఏపీలో బీజేపీని పూర్తిగా చంపేశారు. ఆనాడు తెలంగాణలో ఎంతో మంది చనిపోయినా.. ఇటు సమైక్యాంధ్ర కోసం ఆంధ్రులు పోరాడినా జాతీయ పేపర్లలో ఆ వార్తలు రాలేదు.. మా కడుపుకోత మీకు కనిపించదా?’ అని పవన్ అన్నారు. ‘కేంద్ర మంత్రుల మునిమవళ్లు, మనవరాళ్లు ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా జాతీయ పత్రికల్లో వస్తుంది. మా బాధ మాత్రం రాదు. నాయకులు చేసిన తప్పుకి జనం బాధపడకూడదు. నన్ను కాకినాడకు వచ్చి ఏం చేస్తావు? అంటున్నారు. నేను పొలిటికల్ డ్రామా చేయాలనుకుంటే తాడో పేడో తేల్చుకుంటా. సీపీఐ రామకృష్ణకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వామపక్ష పార్టీలు నాకు మద్దతు తెలిపాయి. సీతారాం ఏచూరి మాట్లాడింది నాకు బాగా నచ్చింది" అని పవన్ వ్యాఖ్యానించారు.