: కాంగ్రెస్ వెన్ను పోటు పొడిస్తే... బీజేపీ పొట్టలో పొడిచింది: వేడి పెంచిన పవన్ ప్రసంగం
రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను వెన్నుపోటు పొడిస్తే, కాపాడండయ్యా అంటూ బీజేపీ వద్దకు వెళితే, వాళ్లు పొట్టలో పొడిచారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. దాదాపు గంట నుంచి సాగుతున్న ఆయన ప్రసంగం సాగుతున్న కొద్దీ విమర్శల వాడి పెరిగినట్టు కనిపిస్తోంది. "రెండు జాతీయ పార్టీలు కలిసి, సంస్కరణల గురించి మాట్లాడే గొప్ప గొప్ప రాజకీయ నాయకులు రెండు రాష్ట్రాల్లో అస్థిరతను సృష్టించారు. ఏ రాజకీయ పార్టీలైనా సరే భారతదేశ సమగ్రతను, సుస్థిరతనూ కాపాడాలే తప్ప, ఇలా చేతగాని తనం వల్ల, దోపిడీ విధానాల వల్ల ప్రజలను విడగొట్టి, అటు తెలంగాణకూ న్యాయం చేయక... ఇప్పటికీ హైకోర్టును ఇవ్వకుండా తెలగాణ వారికి... అలాగే సీమాంధ్ర వారికి స్పెషల్ ప్యాకేజీ ఇస్తాం, స్పెషల్ స్టాటస్ ఇస్తాం అని చెప్పి ఈ రోజున ఏమిచ్చారు? రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు" అని పవన్ విమర్శించారు. 1972లో ఇందిరాగాంధీ కలిసుండాలని చెప్పిన తరువాత, హైదరాబాద్ అందరిదీ అన్న భావనతో కొన్ని లక్షల కుటుంబాలు తరలి వెళ్లాయని పవన్ గుర్తు చేశారు. ఆ తరువాత 42 సంవత్సరాలు కలిసున్న తరువాత, అక్కడే బిడ్డలను, ఆ బిడ్డలకు బిడ్డలను మనవళ్ల రూపంలో చూసుకున్న తరువాత 2014లో ఒకే ఒక్క కాంగ్రెస్ పార్టీ, ఇంకో భారతీయ జనతా పార్టీ కలసి రాష్ట్రాన్ని విడదీస్తున్నామని చెప్పాయని అన్నారు. ఆపై రాష్ట్రానికి హోదాను ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా అన్ని పార్టీలూ అంగీకరించాయని, దానికి కూడా విలువ లేదా? అంటూ పవన్ ప్రశ్నించారు. 'సిగ్గు తెచ్చుకోండి మీరు' అంటూ ఆవేశంగా అన్నారు.