: ఆ పాచిపోయిన రెండు లడ్డూలను టీడీపీ సర్కారు తీసుకుంటుందా? తీసుకోదా? అన్నదే ప్రశ్న: పవన్ విమర్శనాస్త్రాలు
"స్పెషల్ స్టేటస్ ఇస్తాం ఇస్తాం అని చెప్పి ఊరించి ఊరించి, త్వరలోనే తీపి కబురు అని ప్రతి ఒక్క బీజేపీ ఎమ్మెల్యే, ప్రతి టీడీపీ ఎమ్మెల్యే, ప్రతి టీడీపీ ఎంపీ చెబితే, నేనూ మీలాగే ఇస్తారేమో ఇస్తారేమో అని చూస్తుంటే... అదిగదిగో ఇచ్చారు లడ్డూలు చాలా మంచి లడ్డూలు. పాచి కంపు కొట్టే లడ్డూలు ఇచ్చారు. అయినా ఇన్ని కోట్ల మందికి వారిచ్చిన లడ్డూలు ఏం సరిపోతాయి. మన పాతిక మందికే సరిపోవు. వాళ్లే కొట్టుకుంటారు ఆ లడ్డూల కోసం" అంటూ లక్షలాదిగా తరలివచ్చిన అభిమానులను ఉద్దేశించి పవన్ కల్యాణ్ ప్రసంగిస్తున్నారు. తొలుత బీజేపీ నేత వెంకయ్యనాయుడును ఉద్దేశించి ప్రారంభమైన ప్రసంగం, ఆపై తెలుగుదేశంవైపు నడిచింది. తన ప్రసంగంలో ప్రత్యేక ప్యాకేజీని 'లడ్డూ'తో పోలుస్తూ పవన్ మాట్లాడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం, వారి నాయకులపై గౌరవం ఉందని, అది తగ్గలేదని చెప్పిన పవన్, తనకు వ్యక్తిగతంగా ఏ పార్టీతోనూ విభేదాలు లేవని, ప్రజా సమస్యల విషయానికి వస్తే మాత్రం తాను విభేదిస్తానని స్పష్టం చేశారు. ఇప్పుడు టీడీపీ సర్కారు ఆ పాచిపోయిన రెండు లడ్డూలను తీసుకుంటుందా? తీసుకోదా? అన్నదే మన ముందున్న ప్రశ్నని అన్నారు.