: ఏపీకి ఏదైనా చేయాలని అనిపిస్తోంది: నిర్మలా సీతారామన్
కేంద్ర ప్రభుత్వంలో వాణిజ్య మంత్రిగా ఉన్న తనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైనా చేయాలని ఉందని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆమె, హోదాతో సమానమైన సాయాన్ని కేంద్రం ప్రకటించిందని అన్నారు. రాజకీయ కారణాలతోనే హోదాపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారని ఆరోపించిన నిర్మల, కేంద్ర మంత్రులమంతా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి ప్రజలకు నిజానిజాలను వివరించి చెబుతామని అన్నారు. తన వంతుగా ఏపీలో పారిశ్రామిక కారిడార్ ను మరింత అభివృద్ధి చేసేందుకు, తద్వారా వాణిజ్యం పెరిగేందుకు కృషి చేస్తానని అన్నారు. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని నిర్మలా సీతారామన్ అంచనా వేశారు.