: రక్తాన్ని తలపిస్తోన్న ‘డాల్డికన్’ నది నీరు... కాలుష్యం కోరల్లో చిక్కుకున్న తాగునీటి నది తీరు!
పర్యావరణం పట్ల మనిషి చూపిస్తోన్న నిర్లక్ష్యం ఆ మనిషికే కీడు తెచ్చిపెడుతున్న సంఘటనలు ఎన్నో ఎదురవుతున్నాయి. మానవ జీవనానికి ఉపయోగపడే ఎన్నో వనరులు నిర్వీర్యమవుతూ మానవ వినాశనానికి బాటలు వేస్తున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తోన్నప్పటికీ అలాంటి నిర్లక్ష్యాలే ఎన్నో కనిపిస్తున్నాయి. తాగడానికి ఉపయోగపడే నదుల నీరు విషంలా మారిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో నదులు కలుషితమైపోతూ రోగాలకు నిలయంగా మారుతున్నాయి. అలాంటి నిర్లక్ష్యానికే గురయి రష్యాలోని ‘డాల్డికన్’ అనే నది నేడు ఎర్రని రక్తాన్ని తలపించేలా ఎరుపురంగులోకి మారిపోయింది. ఆ దేశంలో కాలుష్యంలో తొలి స్థానంలో నిలిచిన నోరిల్స్క్ పట్టణంలో ఆర్కిటిక్ ప్రాంతానికి దగ్గరగా ఈ నది ఉంది. ఒకప్పుడు ‘డాల్డికన్’ నది నోరిల్స్క్ పట్టణ వాసీయులకు తాగునీటిని అందించేది. అయితే కాలక్రమంలో నదికి పరిసర ప్రాంతాల్లో పలు రసాయన పరిశ్రమలు వెలిశాయి. ఇంకేముంది, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను నదిలోకి వదిలేశారు. దీంతో నది మొత్తం కాలుష్యం బారిన పడింది. నీరు మొత్తం ఎర్రటి రంగులోకి మారి రక్తాన్ని తలపిస్తోంది. ఇప్పుడు ఆ నీటిని చూస్తే ఈ నీరేనా, అప్పట్లో తాగడానికి ఉపయోగపడేది అని ఆశ్చర్యపోతున్నారు. దీనిపై స్థానిక ప్రజలు సామాజిక వేదిక ద్వారా ఉద్యమాన్ని చేబట్టారు. ఎన్నో ఫిర్యాదులు చేస్తున్నారు. నదిని కాపాడాలని కోరుతున్నారు. ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.