: ఇంతటి దుర్మార్గం చూస్తుంటే ఎంతో బాధ కలుగుతోంది: స్పీకర్ కోడెల
మూడు రోజుల పాటు జరగాల్సిన వర్షాకాల సమావేశాలు ఇలా సాగుతాయని తాను భావించలేదని, వైకాపా సభ్యుల దుర్మార్గం చూసి తనకెంతో బాధ కలుగుతోందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వ్యాఖ్యానించారు. పలుమార్లు వాయిదా పడ్డ అసెంబ్లీ ఈ మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో తిరిగి సమావేశం కాగా, పరిస్థితి ఏ మాత్రం మెరుగు పడలేదు. వైకాపా సభ్యులు మార్షల్స్ పై చేయి చేసుకోవడం, తనపైకి దూసుకు రావడం, మైకులు, కెమెరాలు ధ్వంసం చేయడం వంటి ఘటనలు కలచి వేశాయని, చర్చలు జరగాల్సిన సభా సమయం ఇలా దుర్వినియోగం అవుతుందని అనుకోలేదని అన్నారు. ఎన్నో సబ్జెక్టులపై చర్చించి ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాలని భావించానని, దురదృష్టం కొద్దీ విపక్షాలు సహకరించలేదని ఆయన అన్నారు. సభ్య సమాజం తలదించుకునే ఇటువంటి అసభ్యకరమైన, దురుసు ప్రవర్తన నేపథ్యంలో బాధతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు కోడెల తెలిపారు.