: తాగిన మైకంలో పాముని పకోడిలా కరకరా కొరికి, నమిలి మింగేసిన వ్యక్తి.. తప్పిన ప్రాణాపాయం!
పీకల దాకా తాగి ఏకంగా పాముని పకోడిలా నమిలి మింగేశాడో వ్యక్తి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న వినోద్ అనే వ్యక్తి రాత్రి తాను నిద్రలోకి జారుకుంటున్న సమయంలో ఈ పనిచేశాడు. పెట్రోల్ బంక్ నుంచి ఇంటికి వస్తూ మార్గమధ్యంలో మద్యం తాగిన వినోద్ ఇంటికి వచ్చి నిద్రపోయాడు. అయితే, ఇంటి పై కప్పుపై ఉన్న ఓ పాము ఒక్కసారిగా వినోద్‌పై పడింది. ఆ పాము సరిగ్గా నోరు తెరచి నిద్రపోతున్న వినోద్ నోట్లో పడింది. దీంతో వినోద్ దాన్ని పకోడిలా కరకరా కొరికి నమిలి మింగాడు. వినోద్ పాముని మింగిన కొద్ది సేపటికి అతని తల్లి రాంప్యారీ అక్కడికి వచ్చింది. వినోద్ నమిలేయగా మిగిలిన ఉన్న సగం పాము ఆమె కంటపడింది. విషయాన్ని గమనించి వినోద్‌ని వెంటనే ఆ గ్రామంలో వైద్యం చేసే వ్యక్తి వద్దకు తీసుకెళ్లి జరిగిన విషయాన్ని తెలిపింది. వినోద్ వాంతులు చేసుకునేందుకు అతడు మందులు ఇవ్వడంతో అతడికి ప్రాణాపాయం తప్పింది. అనంతరం వినోద్‌ని పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు.