: అవాంఛనీయ ఘటనలు జరగకుండా పవన్ కల్యాణ్ అభిమానులు సహకరించాలి: తూ.గో జిల్లా ఎస్పీ రవిప్రకాశ్
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కేంద్రం నుంచి సానుకూల ప్రకటన రాని నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని జేఎన్టీయూ గ్రౌండ్ లో జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ నిర్వహించే సభపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అభిమానుల తాకిడి విపరీతంగా ఉండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పవన్ కల్యాణ్ అభిమానులు సహకరించాలని కోరారు. జనసేనాని సభ కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రవిప్రకాశ్ పేర్కొన్నారు. వాహనాలను పలుచోట్ల దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ అభిమానుల సహకారం కావాలని అన్నారు. సభకు లక్షమంది వరకు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వచ్చిన వారికి పార్కింగ్ సదుపాయం కల్పించినట్లు పేర్కొన్నారు. కాగా, నిన్న రాత్రి నుంచి పవన్ కల్యాణ్ నగరంలోని జీఆర్టీ హోటల్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది.