: ట్రాయ్ ముందుకు టెల్కో వార్... జియోకు వ్యతిరేకంగా ఒకే మాటపై ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్!
రిలయన్స్ జియోకు, ఇతర టెలికం సంస్థలకు మధ్య నెలకొన్న టెలికం వార్ మరింత ముదిరింది. నిన్నటి ముఖేష్ అంబానీ స్టేట్ మెంట్ తరువాత, ఈ యుద్ధాన్ని నివారించేందుకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) రంగంలోకి దిగింది. ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ తదితర టెల్కోలను అత్యవసర సమావేశానికి పిలిచింది. జియో సిమ్ కార్డులున్న స్మార్ట్ ఫోన్ల నుంచి వచ్చే కాల్స్ కు ఇంటర్ కనెక్ట్ పాయింట్లను అందించలేమని ఈ సంస్థలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు టెల్కోల సంఘం కాయ్ (సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) నుంచి ప్రధానికి లేఖను కూడా పంపారు. ఇంటర్ కనెక్ట్ పాయింట్లు ఇవ్వాలంటే మౌలిక వసతులు చాలవని, చార్జీలు ఎవరిస్తారని కాయ్ ప్రశ్నించింది. ఈ మూడు కంపెనీలూ ఒకే మాటపై ఉన్నాయి. ఇక జియో సిమ్ లను తీసుకున్న వారు ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు. టెల్కోల మధ్య నెలకొన్న ఈ వివాదం మరింతగా పెరగకముందే చర్యలు చేపట్టాలని భావిస్తున్న కాయ్, మూడు పెద్ద టెలికం సంస్థలనూ సమావేశానికి రమ్మని ఆహ్వానించింది. కాగా, ఈ సమస్య ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ లకు మాత్రమే సంబంధించింది కాదని, అన్ని సభ్య టెలికం కంపెనీలనూ ట్రాయ్ ఆహ్వానించాలని కాయ్ డిమాండ్ చేసింది. కాగా, జియో రాకతో తమ కస్టమర్లు భారీ ఎత్తున తగ్గిపోతారన్న ఉద్దేశంతోనే ఎయిర్ టెల్, ఐడియాలు కనెక్టివిటీ పాయింట్లను ఇవ్వడం లేదని, ఈ సమస్యను పెద్దదిగా చూపుతున్నారని టెలికం నిపుణులు వ్యాఖ్యానించారు.