: మేం చెప్పిందొకటి, బీజేపీ ఇప్పుడు చేస్తున్నదొకటి... అంతా ద్రోహం: మాజీ మంత్రి జైరాం రమేష్ నిప్పులు


ఆంధ్రప్రదేశ్ ను విభజిస్తున్న వేళ, ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటి ఎన్డీయే సర్కారు తుంగలో తొక్కుతోందని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ నిప్పులు చెరిగారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన, తాము చెప్పింది ఒకటైతే, ఇప్పుడు జరుగుతున్నది మరొకటని, దీనివల్ల విడిపోయిన రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. 14వ ఆర్థిక సంఘం హోదా ఇవ్వొద్దని ఎక్కడా చెప్పలేదని, హోదా ఇవ్వద్దని చెప్పినట్టు ఎక్కడైనా ఉంటే తనకు చూపాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తెలుసుకోవాలని హితవు పలికారు. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును రాష్ట్రం చేపట్టేందుకు వీలు లేదని, కేంద్రం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. విభజన చట్టాన్ని బీజేపీ అర్థం చేసుకోలేదని అభిప్రాయపడ్డ ఆయన, చట్టంలోని 13వ షెడ్యూల్ ను ఓసారి చదవాలని సూచించారు. అరుణ్ జైట్లీ ప్రకటించిన ప్యాకేజీలో ఏమీ లేదని, రాష్ట్రానికి వచ్చేదేంటో తనకు తెలియడం లేదని, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏపీ వాసులకు ద్రోహం చేస్తోందని అన్నారు.

  • Loading...

More Telugu News