: ఏపీకి సాయం చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు: ఢిల్లీలో కేటీఆర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక సాయం చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈరోజు సాయంత్రం ఆయన ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఏపీకి సాయం చేయడం మంచిదేనని, అయితే రెండు రాష్ట్రాలను సమంగా చూడాలని, లేదంటే తెలంగాణ ప్రజలు కేంద్రాన్ని తప్పుబట్టే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు విడుదల చేయాలని జైట్లీని కోరినట్లు పేర్కొన్నారు. తెలంగాణ కూడా వెనకబడిన రాష్ట్రమని వివరించినట్లు కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్ నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను కోరినట్లు చెప్పారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు నిధులు విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు.