: శాసనమండలిలో చంద్రబాబు, రామచంద్రయ్య మధ్య స్వల్ప వాగ్వివాదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్యకి మధ్య శాసన మండలిలో స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది. శాసనమండలిలో చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడుతూ విశాఖపట్నానికే రైల్వే జోన్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు తెలిపారు. అనంతరం ఆనాడు యూపీఏ గవర్నమెంట్ రాష్ట్రానికి వచ్చే నష్టాల గురించి ఆలోచించ లేదని అన్నారు. రాష్ట్రానికి ఎంత ఇస్తున్నారో ఏమి ఇస్తున్నారో, ఆస్తులు, అప్పులు ఎలా పంచుకోవాలనే అంశాలపై స్పష్టమైన ప్రకటన చేయలేదని ఆయన అన్నారు. ఇంతలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య కల్పించుకొని ఆనాడే ఈ అంశాలపై చంద్రబాబు ప్రశ్నించాల్సిందని అన్నారు. అసెంబ్లీలోనూ మాట్లాడాల్సిందని అన్నారు. దీంతో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఆరోజు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రానికి చెందిన హేమాహేమీ నేతలున్నారు.. మీరు అడగలేకపోయారు.. అసెంబ్లీలోనూ నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దురుద్దేశంగా విభజన చేస్తున్నారని నేను ప్రశ్నించా.. ఎనిమిది రోజులు ఢిల్లీలోనూ పోరాడా. వాస్తవాలు లేకపోతే ఏం చెప్పినా విశ్వసనీయత ఉండదు. ప్రజలు అన్నీ అర్థం చేసుకుంటున్నారు. సమైక్య ఆంధ్రలో పదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉండే అవకాశాన్ని ప్రజలు నాకు ఇచ్చారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఇచ్చారు’ అని అన్నారు. ‘నన్ను ఎదుర్కునే శక్తి లేక ఆనాడు విభజన చేశారు. మీ చేతులు మీరే కాల్చుకున్నారు. నేటి ఇబ్బందులకు ఆనాటి వ్యవస్థ తీసుకున్న నిర్ణయాలే కారణం. నాడు చేసిన తప్పు వల్ల నేను ఇన్ని సార్లు ఢిల్లీకి వెళ్లవలసి వస్తోంది.. ప్రజలకు తెలుసు, కాంగ్రెస్ ఆడిన డ్రామా.. అందుకే వారు నాకు ఓట్లేసి గెలిపించారు’ అని చంద్రబాబు నవ్వుతూ వ్యాఖ్యానించారు.