: నేను మీలా కాదు... నా వ్యూహం నాకుంది, ఏది ఎప్పుడు చేయాలో తెలుసు: ప్రతిపక్ష పార్టీలపై చంద్రబాబు విసుర్లు


రాష్ట్రంలోని విపక్ష పార్టీల సభ్యుల్లా ప్రతిదానికీ రోడ్డున పడే రకాన్ని తాను కాదని, తన వ్యూహాలు తనకు ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. మండలిలో ప్రసంగించిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 14వ ఆర్థిక సంఘంతో తనకు సంబంధం లేదని, హోదా ఇవ్వాలన్నదే తన డిమాండని స్పష్టం చేశారు. తనను ఇబ్బంది పెట్టేందుకు కోర్టుల చుట్టూ తిప్పాలని కొందరు నిత్యమూ ప్రయత్నిస్తున్నారని, వారి కోరిక కలగానే మిగులుతుందని అన్నారు. నిత్యమూ ప్రభుత్వం తరఫున కోర్టులతో తాను పోరాడుతున్నానని, గ్రీన్ ట్రైబ్యునల్ నుంచి తనపై ఉన్న వ్యక్తిగత ఆరోపణలు, తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కేసులపై న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నానని అన్నారు. పదిహేనేళ్ల క్రితం వాజ్ పేయి ప్రధానిగా ఉన్న వేళ, తెలుగుదేశం ఎంపీలపైనే బీజేపీ ఆధారపడిందని, ఎన్ని మంత్రి పదవులు ఇస్తామని ఆశ పెట్టినా తాను తలొగ్గలేదని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా మంత్రులతో రాజీనామాలు చేయించడం ఒక్క సెకను పనని, దాంతో ప్రయోజనాలు ఏం దక్కుతాయని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా సాగుతున్నానని, అందుకు ఏం చేయాలో, ఎప్పుడు చేయాలో తనకు బాగా తెలుసునని అన్నారు.

  • Loading...

More Telugu News