: ప్ర‌తిదానికి రాజీనామాలు చేయ‌మ‌న‌డం స‌రికాదు: శాసనమండలిలో చంద్రబాబు


ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదాపై శాస‌న‌మండ‌లిలో ప్ర‌క‌ట‌న చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... ‘నా జీవితంలో రాజీ అనే అంశ‌మే లేదు.. నా చిత్త‌శుద్ధిని ఎవ‌రూ శంకించ‌లేరు. ప్ర‌తిదానికి రాజీనామాలు చేయ‌మ‌న‌డం స‌రికాదు. అధికారం కోసం నేను తాప‌త్ర‌య‌ప‌డబోను. రాష్ట్రాభివృద్ధి విష‌యంలో వెన‌క‌డుగు వేయ‌బోను’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర‌ప్ర‌యోజ‌నాల అంశంలో రాజీ ప‌డే అవ‌కాశ‌మే లేదని ఆయ‌న అన్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టు కావాలంటే కేంద్రం ఆదుకోవాల్సిన ప‌రిస్థితి ఉంద‌ని తెలిపారు. ప్రత్యేక హోదా అంశం రాష్ట్రంలో ఎంతో సెంటిమెంట్ అంశంగా త‌యారైందని చంద్ర‌బాబు అన్నారు. ‘రాష్ట్ర విభ‌జ‌న చీక‌టి గ‌దిలో జ‌రిగింది, మ‌న‌ల్ని ఎంతో బాధ‌క‌లిగించింది. కేంద్రం సాయం చేయాల్సిందే. కేంద్రం నుంచి రావాల్సినవ‌న్నీ అడుగుతూనే ఉన్నాం. ప్ర‌తిప‌క్షాలు మాపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ప‌ట్టిసీమ‌ను వ‌ట్టిసీమ అన్నారు. ప‌ట్టిసీమ కోసం 9, 10 సార్లు ఢిల్లీకి వెళ్లా, స‌మీక్ష‌లు చేశా. చివ‌రికి పూర్త‌యింది. ఇప్పుడు ప‌ట్టిసీమ వ‌ల్ల ఎంతో మంది రైతులు లాభం పొందుతున్నారు. అన్ని ప‌నులు పూర్తి స‌మ‌ర్థంగా పూర్తి చేస్తాం’ అని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఏం చెబుతుందో కూడా వినే ప‌రిస్థితుల్లో ప్ర‌తిప‌క్షం లేదని చంద్ర‌బాబు అన్నారు. శాస‌న‌స‌భ‌లో వారి తీరు బాగోలేద‌ని పేర్కొన్నారు. పోల‌వ‌రం ప‌నులు అనుకున్న ల‌క్ష్యంలోపే పూర్తి చేసేందుకు కృషి చేస్తున్న‌ట్లు తెలిపారు. వారానికి ఒక‌సారి డ్రోన్ కెమెరాల ద్వారా పోల‌వ‌రం ప‌నులు ప‌రిశీలించాల‌ని కేంద్రానికి వివ‌రించామ‌ని తెలిపారు. తాను నెల‌కోసారి పోల‌వ‌రం వెళ్లి ప‌నులు ప‌రిశీలిస్తున్నట్లు చంద్ర‌బాబు చెప్పారు. పోలవ‌రం ప్రాజెక్టు కోసం 50 వేల ఎక‌రాల భూములు సేక‌రించాల్సిన అవ‌స‌రం ఉందని పేర్కొన్నారు. 2018లోపు పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తి చేయాల‌నే సంక‌ల్పంతో ఉన్నట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News