: ప్రీతీ రాఠీపై యాసిడ్ పోసి చంపిన అంకుర్ కు మరణ శిక్ష!


తన ప్రేమను కాదన్నదన్న కోపంతో ఢిల్లీ నుంచి ముంబై వరకూ టికెట్ లేకుండా ప్రయాణించి, ముంబైకి చెందిన నర్స్ ప్రీతీ రాఠీపై యాసిడ్ పోసి ఆమె మరణానికి కారణమైన అంకుర్ పన్వార్ కు ముంబై కోర్టు మరణదండన విధించింది. ఈ ఘటన 2013లో జరుగగా, విచారణ జరిపిన పోలీసులకు అంకుర్ 2014లో చిక్కాడు. కేసు వివరాలను పరిశీలిస్తే, ముంబైలోని నావెల్ ఆసుపత్రిలో పనిచేసే ప్రీతిది ఢిల్లీ. ఆమె ఇంటి పక్కనే అంకుర్ నివాసం ఉండేవాడు. తాను ఆమెను ప్రేమించినట్టు చెప్పినా, ఉద్యోగం లేదని ప్రీతి కుటుంబం నిరాకరించింది. ఆ కోపంతో ఉన్న అంకుర్ కు ప్రీతి కుటుంబం ముంబై వెళుతోందని తెలిసింది. రాత్రంతా అదే రైలులో ప్రయాణం చేసిన అతను, ఉదయాన్నే వాష్ రూం వద్ద ప్రీతి ఉండగా, ఆమె భుజంపై చెయ్యేశాడు. వెనక్కు తిరిగి చూడగానే ఆమె ముఖంపై యాసిడ్ పోశాడు. యాసిడ్ నోట్లోకి కూడా పోవడంతో అన్నవాహిక, ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాడిలో గాయపడిన ఆమె, నెల రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. కేసును విచారించిన కోర్టు అంకుర్ ను దోషిగా పేర్కొంటూ మరణశిక్షను నేడు ఖరారు చేసింది. కాగా, ప్రపంచం మొత్తంలో సగటున ఏడాదికి 1500 యాసిడ్ దాడులు జరుగుతుండగా, వాటిల్లో ఇండియాలోనే 1000కి పైగా కేసులు నమోదవుతుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News