: గత సీఎంలు శంకుస్థాపనలు చేసి కొబ్బరికాయలు కొట్టేందుకు మాత్రమే పరిమితమయ్యేవారు: హరీశ్‌రావు
గత సీఎంలు అభివృద్ధి పనులకు, ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి కొబ్బరికాయలు కొట్టేందుకు మాత్రమే పరిమితమయ్యేవారని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తోన్న ఆయన కోడేరు సమీపంలోని రెండో లిఫ్టు మోటార్లను ప్రారంభించారు. అనంతరం జొన్నలబొగడ జలాశయం నుంచి కాలువకు నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయని అన్నారు. గత సీఎంలు చిత్తశుద్ధి లేకుండా పనులు చేసేవారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని హరీశ్‌రావు అన్నారు. ప్రతిపక్షాలు తాము చేస్తోన్న అన్ని కార్యక్రమాలకు ఆటంకాలు కలిగిస్తున్నాయని మండిపడ్డారు. కొత్త జిల్లాల ఏర్పాటులో కూడా అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆయన అన్నారు. తెలంగాణను కష్టపడి తెచ్చుకున్నామని, ఇష్టపడి అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎవరెన్ని అడ్డంకులు కలగజేయాలని చూసినా అభివృద్ధి పనులను కొనసాగిస్తామని అన్నారు.