: చంద్రబాబూ! తేడా వస్తే నామరూపాల్లేకుండా పోతావ్: కేవీపీ హెచ్చరిక
ప్రత్యేక ప్యాకేజీ అంటూ కేంద్రం చెబుతున్న మాటలను సమర్థిస్తున్న చంద్రబాబు అందుకు తగిన మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు హెచ్చరించారు. ఈ మధ్యాహ్నం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ, "ఈ ప్యాకేజీల్లో వచ్చే అడ్వాంటేజీలు మీకు వస్తూనే ఉంటాయి. చాలా వాటిల్లో మీరు తీసుకుంటూనే ఉన్నారు. వాటితో రాజీపడి పోతున్నారు. రేపు పోలవరం అంతర్ రాష్ట్రాల సమస్యగా మారి, దాన్ని సాల్వ్ చేసుకోలేక, ఏదైనా సమస్య వస్తే, అది కేవలం చంద్రబాబునాయుడూ... నీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం వచ్చినదే అవుతుంది. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి పబ్బం గడుపుకుంటున్నావ్. తేడా వస్తే నామరూపాలు వుండవు. అది ఒక్కటి మటుకు చంద్రబాబును హెచ్చరిస్తున్నాను" అన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేసిన ఆయన, అధికారంలో ఉన్నవారు మాట తప్పారని ఆరోపించారు. బీజేపీ మాట నిలబెట్టుకోవాలని హితవు పలికారు. 10వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జాతీయ రహదారులను ముట్టడించి, నిరసనలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు కనువిప్పు కలిగించేలా యువత వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.