: జియో సిమ్ కోసం వెళితే చుక్కెదురు... ఎప్పటికి దక్కెనో?


దేశంలో ప్రతి ఒక్కరూ రిలయన్స్ జియో 4జీ టెక్నాలజీ అనుభవాన్ని ఉచితంగా డిసెంబర్ వరకూ ఆస్వాదించవచ్చని రిలయన్స్ సంస్థ ఆర్భాటంగా ప్రకటించింది. ప్రతి ఒక్కరికీ ఉచితంగా సిమ్ అందించనున్నట్టు తెలిపింది. కానీ, జియో సిమ్ కార్డు కోసం రిలయన్స్ డిజిటల్, మినీ స్టోర్ల వైపు పరుగు తీస్తున్న వారికి నిరాశే ఎదురవుతోంది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ నిర్వాహకులు కస్టమర్లను ఉట్టి చేతులతో వెనక్కి పంపిస్తున్నారు. ప్రస్తుతానికి సిమ్ కార్డులు లేవనే సమాధానం ఎదురవుతోంది. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని రిలయన్స్ డిజిటల్ స్టోర్ అయితే, ఏకంగా 20 నుంచి 25 రోజుల తర్వాత రండంటూ సిమ్ కోసం వచ్చిన వారిలో టోకెన్ పెట్టి పంపిస్తోంది. రద్దీని తగ్గించడానికి రోజుకు ఇంతమందికే అని టోకెన్ విధానాన్ని రిలయన్స్ స్టోర్స్ పాటిస్తున్నాయి. వాస్తవానికి రిలయన్స్ సిమ్ కార్డుల పంపిణీని రిలయన్స్ సంస్థే కావాలనే ఆలస్యం చేస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే సిమ్ కార్డు తీసుకున్న వారు యాక్టివేషన్ కోసం వారం, పది రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. యాక్టివేట్ చేయాల్సిన దరఖాస్తులు భారీగా పోగుబడడంతో ముందు వాటిని క్లియర్ చేసే పనిలో పడింది. అందుకే తాజాగా సిమ్ ల జారీని నిలిపివేసినట్టు తెలుస్తోంది. తాజాగా ఎలాంటి సిమ్ కార్డులు జారీ చేయవద్దని, దీనివల్ల సమస్యలు ఎదురై సంస్థకు చెడ్డపేరు వస్తుందని జియో కోరినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News