: స్మార్ట్ ఫోన్ లాక్ కోడ్ చెప్పలేదని భార్యను స్నేహితులతో చంపించిన భర్త!


తాను వాడుతున్న స్మార్ట్ ఫోన్ లాక్ ప్యాట్రన్ కోడ్ ను చెప్పలేదన్న చిన్న కారణంతో భార్యను తన స్నేహితులతో హత్యచేయించాడో భర్త. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, వినీత్ కుమార్ దివాకర్, పూనమ్ వర్మ భార్యాభర్తలు. వ్యాపారం చేసుకునే వినీత్ కాన్పూర్, ఝాన్సీల మధ్య తిరుగుతూ ఉంటాడు. గత నెల 29 రాత్రి పూనమ్ వర్మ హత్య జరిగింది. వారి నాలుగేళ్ల కుమార్తె ఉదయం పూట ఏడుస్తూ ఉండటాన్ని చూసిన ఇరుగు పొరుగువారు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఈ ఘటనలో తనకు ఏ పాపమూ తెలియదని తొలత వినోద్ వాదించాడు. అతని కాల్ డేటా సైతం అందుకు తగ్గట్టుగానే ఉండటంతో పోలీసుల విచారణ ముందుకు సాగలేదు. కానీ అతనిపైనే అనుమానం పెంచుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపి నిజాన్ని రాబట్టారు. నిన్న తను చేసిన తప్పును, భార్య హత్య జరిగిన వైనాన్ని వెల్లడించాడు. వినీత్ కథనం ప్రకారం, గత నెలలో ఓ స్మార్ట్ ఫోన్ ను పూనమ్ కు కొనిచ్చిన తరువాత ఆమె ప్రవర్తన మారిపోయింది. తనను, కుమార్తెను చూసుకోకుండా అలక్ష్యం చేసింది. మరెవరూ దాన్ని తెరవకుండా ఫోన్ ను లాక్ చేసింది. ఈ విషయంలో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. ఆమె లాక్ కోడ్ ఇవ్వలేదు. దాంతో ఆగ్రహంతో ఆమెను వదిలించుకోవాలని భావించిన వినీత్, తన స్నేహితులు లక్ష్మణ్, కమల్ లను హత్యకు ఒప్పించి రూ. 80 వేలు ఇచ్చేందుకు డీల్ కుదుర్చుకున్నాడు. ముందుగా ప్లాన్ వేసుకున్నట్టుగా ఆగస్టు 29న కాన్పూర్ వెళ్లిన ఆయన, తన భార్యకు ఫోన్ చేసి స్నేహితులు వస్తారని, వారికి తన కంప్యూటర్ ను ఇవ్వాలని చెప్పాడు. వారికి కంప్యూటర్ ను ఇస్తున్న సమయంలోనే పూనమ్ ను వారు హత్య చేశారు. ఆపై ఆభరణాలు తీసుకుని దోపిడీ జరిగినట్టుగా సీన్ క్రియేట్ చేసి పారిపోయారు. వినీత్ నేరాన్ని అంగీకరించడంతో అతన్ని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News