: జగన్ సహా రోడ్డెక్కిన వైకాపా... 'ప్యాకేజీ కాదు, చెవిలో క్యాబేజీ' అన్న వైకాపా అధినేత
తీవ్ర నిరసనలు, విమర్శల మధ్య అసెంబ్లీ వాయిదా పడగా, ప్లకార్డులు చేపట్టిన వైకాపా ఎమ్మెల్యేలు జగన్ నాయకత్వంలో అసెంబ్లీ ఎదుట ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు. అసెంబ్లీ గేటు బయటి నుంచి రవీంద్రభారతి వరకూ వీరి ప్రదర్శన కొనసాగగా, అంతకు మించి అనుమతించలేమని పోలీసులు స్పష్టం చేయడంతో వారు ఆగిపోక తప్పలేదు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, "నిన్న జైట్లీ చేసింది ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన కాదు. చెవిలో క్యాబేజీ పెట్టే ప్రకటన మాత్రమే. చెవిలో క్యాబేజీని దగ్గరుండి చంద్రబాబు పెట్టించారు. తరువాత జైట్లీ ప్రకటనను ఆహ్వానిస్తున్నామని చంద్రబాబు చెప్పడం అందరమూ చూశాం. ఇప్పుడు జీఎస్టీ వచ్చింది. దాన్నుంచి రాష్ట్రాన్ని మినహాయించాలని డిమాండ్ చేయాలి. అందుకిదే సరైన సమయం. జీఎస్టీలో మాత్రమే స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. ప్రత్యేక హోదా వస్తేనే పారిశ్రామిక రాయితీలు లభిస్తాయి. వేలల్లో పరిశ్రమలు, లక్షల్లో ఉద్యోగాలు వస్తాయి. నిన్న రాత్రి కేంద్రం చేసిన ప్రకటన, చంద్రబాబు ఆహ్వానిస్తున్న తీరు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను ఖూనీ చేస్తున్న పరిస్థితే. ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తును ఆహ్వానించడానికి చంద్రబాబు ఎవరండీ? దీనికి నిరసనగా ఎల్లుండి బంద్ కు పిలుపునిస్తున్నాం. ఈ విషయమై కమ్యూనిస్టు నాయకులతో మాట్లాడాను. తక్కువ సమయం ఉంది కాబట్టి ప్రజలే ముందుకు రావాలని కోరుతున్నా. చంద్రబాబు రేపు బీజేపీకి అల్టిమేటం ఇచ్చి, కేంద్ర మంత్రులను ఉపసంహరించుకోవాలి. అప్పుడు ప్రత్యేక హోదా అవకాశాలు మెరుగవుతాయి" అని అన్నారు.