: మీకు ఎన్నిసార్లు చెప్పాను, అసెంబ్లీ ఉద్యోగుల్లో లేడీస్ ఉన్నారు... ఇబ్బంది పెట్టవద్దు: జగన్ తో కోడెల
అసెంబ్లీ ప్రశ్నోత్తరాలు ప్రారంభం కాగానే విపక్ష వైకాపా సభ్యులు పోడియంలోకి దూసుకొచ్చి ప్లకార్డులు పట్టుకుని 'ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు' అని నినాదాలు చేస్తూ, సభా కార్యకలాపాలకు ఆటంకం కల్పిస్తుంటే, స్పీకర్ కోడెల కల్పించుకున్నారు. జగన్ మాట్లాడేందుకు అవకాశం ఇస్తూ, "మీకు ఎన్నిసార్లు చెప్పాను జగన్ మోహన్ రెడ్డి గారూ... మీరు మాట్లాడితేనే మీ సభ్యులు సీట్లలో కూర్చుంటారు. మిగతా ఎవరు మాట్లాడినా పోడియంలోకి దూసుకొస్తారు. అసెంబ్లీ ఉద్యోగుల్లో లేడీస్ ఉన్నారు. వారిని సీట్లలో కూర్చోనీయడం లేదు. ఇది మంచి పద్ధతి కాదు. యూ కెనాట్ హైజాక్ ది హౌస్. దయచేసి సహకరించండి" అన్నారు. ఆపై జగన్ మాట్లాడుతూ, ఇదే సభలో పలుమార్లు ప్రత్యేక హోదాపై తీర్మానం చేసి పంపించామని గుర్తు చేశారు. నిన్నటి జైట్లీ ప్రకటన తరువాత దాన్ని స్వాగతిస్తున్నట్టు చంద్రబాబు మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. ఈ దశలో ఆయన మైక్ ను కట్ చేసిన స్పీకర్, ఇదే విషయమై సభలో ప్రకటన చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రభుత్వ ప్రకటన విన్న తరువాత చర్చిద్దామని చెప్పారు. సభలో వైకాపా సభ్యుల నిరసన కొనసాగుతోంది.