: ‘హోదా’నే మాకు సంతోషం!... ప్యాకేజీకి ధన్యవాదాలు!: కేంద్రం ప్రకటనపై చంద్రబాబు కామెంట్స్
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చేసిన కేంద్రం నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం నుంచి రాత్రి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన ముగిసేదాకా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను ఆసక్తిగా పరిశీలించిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... ఆ తర్వాత విజయవాడలో మీడియా సమావేశంలో తన స్పందనను తెలియజేశారు. ఏపీకి ప్రత్యేక హోదాను ప్రకటించి ఉంటేనే తమకు సంతోషం కలిగేదని ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ తాజాగా ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కేంద్రానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మీడియా సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే... ‘‘ఇచ్చిన దానికి ధన్యవాదాలు. ఇస్తామని ఈ రోజు ప్రకటించిన వాటన్నింటికీ చట్టబద్ధత కల్పించమని అడుగుతున్నాం. వాటన్నింటికీ సంబంధించి తక్షణం అధికారిక ఉత్తర్వులు ఇవ్వాలి. ప్రత్యేక హోదా ఇస్తేనే మాకు సంతోషం. కాదు.. అందుకు సాంకేతిక సమస్యలు ఉన్నాయని మీరు అంటున్నారు. హోదాతో రాగల మొత్తానికి సమానమైన మొత్తాన్ని ఇస్తామని చెబుతున్నారు. అలాంటప్పుడు ఏమిస్తారో స్పష్టంగా చెప్పండి. చెప్పిన దానికి కట్టుబడి సత్వరంగా ఆ నిధులు ఇవ్వండి’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.