: ఇదే అత్యుత్తమ పరిష్కారమట!... ప్యాకేజీపై మోదీ, జైట్లీలకు థ్యాంక్స్ చెప్పిన వెంకయ్య!
ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ పేరిట నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేసిన అసంపూర్తి ప్రకటనపై ఏపీ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే జైట్లీ ప్రకటనను ఆయన పక్కనే కూర్చుని విన్న బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడుకు మాత్రం... సదరు ప్రకటన అత్యుత్తమమైనదిగా కనిపించింది. ప్యాకేజీ ప్రకటన ముగిసి ఇంటికెళ్లిన వెంటనే ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేసిన వెంకయ్య... సమస్యలతో సతమతమవుతున్న ఏపీకి అత్యుత్తమ పరిష్కారం చూపించారంటూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీని కేంద్రం ప్రత్యేక రాష్ట్రంగా చూస్తోందని, ఈ కారణంగానే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఏపీ స్వయం సమృద్ధి సాధించే దాకా కేంద్రం నుంచి సాయం అందుతుందని కూడా ఆయన ప్రకటించారు. ఏపీ వేగంగా సమగ్రాభివృద్ధి సాధించేందుకు సాధ్యమైన ఉత్తమ పరిష్కారం ఇదేనని వెంకయ్య సదరు ట్వీట్ లో పేర్కొన్నారు.