: సీఐడీ అధికారులు నాతో బాగా వ్యవహరించారు... నన్ను పిలిపించడం వెనుక బాబు ప్రకటన తప్ప మరే కారణం లేదు: భూమన


సీఐడీ అధికారులు హరికృష్ణ, భాస్కర్ లు తనతో సభ్యత, సంస్కారంతో నడుచుకున్నారని, తనను ఇబ్బంది పెట్టకుండా ప్రశ్నలు సంధించారని వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. రెండో రోజు సీఐడీ విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తుని ఘటన జరిగిన తరువాత అదే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మంత్రి చినరాజప్ప చేసిన ప్రకటన కారణంగానే ఈ విచారణ జరిగిందని అన్నారు. బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ కారణంగానే కాపులు ఉద్యమం చేశారని ఆయన చెప్పారు. ఈ ఘటనతో సంబంధం లేని తనను సీఐడీ విచారణకు పిలవడం వల్ల కాపు జాతి గుండెలు మండుతున్నాయని అన్నారు. వారంతా తనకు మద్దతు తెలియజేసినందువల్ల వారికి తాను వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన చెప్పారు. తమ పార్టీ అధినేత జగన్ రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచీ ఆయనను సంఘ విద్రోహ శక్తిగా ముద్ర వేసి, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చంద్రబాబు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కుట్రతోనే ఆయన తుని ఘటన వెనుక జగన్, కరుణాకర్ రెడ్డి ఉన్నారని ఆరోపించారని, తన అధికార దర్పం చూపించడం కోసం అధికారులపై ఒత్తిడి తెచ్చి, తనను విచారించేలా చేశారని ఆయన తెలిపారు. రెండు రోజుల సుదీర్ఘ విచారణ పూర్తయిందని, మళ్లీ ఎప్పుడు రమ్మంటారో తెలియదని ఆయన చెప్పారు. తనను విచారణకు పిలవడం వెనుక హోం మంత్రి ఇచ్చిన స్టేట్ మెంట్ కారణం కావచ్చని ఆయన అన్నారు. జగన్ ను ఇబ్బంది పెట్టాల్న లక్ష్యంతోనే తనను విచారించారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News