: ఏం... విజయవాడ ఏపీలో భాగం కాదా?: ఎంపీ అవంతి శ్రీనివాస్
విశాఖ రైల్వే జోన్ పై భీమిలి ఎంపీ అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు రైల్వే జోన్ కేటాయిస్తుందని అన్నారు. అయితే అది విజయవాడా? లేక విశాఖపట్టణమా? అన్నది తెలియదని ఆయన చెప్పారు. ఉత్తరాంధ్రకు చెందిన తాను విశాఖపట్టణానికే రైల్వే జోన్ కోరుకుంటానని అన్నారు. అలా కాకుండా విజయవాడకు రైల్వే జోన్ కేటాయించినా వచ్చిన నష్టమేమీ లేదని, విశాఖపట్టణానికే రైల్వే జోన్ రావాలన్న రూల్ లేదని ఆయన చెప్పారు. ఏపీ రైల్వే జోన్... విశాఖ హక్కు అనేది చాలా కాలంగా ఉన్న నినాదమని, దీనిపై ఇక్కడి ప్రజలు ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నారు కదా? అన్న మీడియా ప్రశ్నకు... మండిపడ్డ అవంతి శ్రీనివాస్ 'ఏం... విజయవాడ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో భాగం కాదా?' అని ప్రశ్నించారు.