: ‘తాజ్ మహల్ ఆన్ ది స్వాన్’ కూల్చివేతకు నిర్ణయం!
భారత్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త పంకజ్ ఓస్వాల్, ఆయన భార్య రాధిక ఓస్వాల్ ఆస్ట్రేలియాలోని పెర్త్ లో నిర్మిస్తున్న అత్యంత ఖరీదైన భవనం ‘తాజ్ మహల్ ఆన్ ది స్వాన్’. స్వాన్ నది ఒడ్డున నిర్మిస్తున్న ఈ భవనం రాజుల కాలం నాటి అత్యంత ఖరీదైన భవనాలను పోలి ఉంటుంది. అయితే, అక్కడ నిర్మిస్తున్న ఈ భవనాన్ని ఇంటి పన్ను ఎగవేత, భవన నిర్మాణ నిబంధనల ఉల్లంఘన వంటి కారణాలతో దీనిని కూల్చివేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. 2010లో పంకజ్ ఓస్వాల్ నిర్వహించే ఎరువుల వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది. దీనిప్రభావం ‘తాజ్ మహల్ ఆన్ ది స్వాన్’పై పడటంతో ఆ నిర్మాణాన్ని నిలిపివేశారు. అంతేకాకుండా, ఈ ఇల్లు న్యాయపరమైన చిక్కుల్లో పడింది. వీటికి తోడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ బ్యాంకింగ్ గ్రూప్ ల రుణాల వసూలు వివాదం నడుస్తోంది. ఈ ఇంటిని ఈనెల 30 నాటికి కూల్చివేస్తామని అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ లో ప్రమాణం చేశారు. అయితే, దీనిని కూల్చేందుకు మాత్రం ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. ఈ నేపథ్యంలో కౌన్సిలే ‘తాజ్ మహల్ ఆన్ ది స్వాన్’ ను కూల్చాలని నిర్ణయించుకుంది. ఇక ఈ భవనం ప్రత్యేకతల విషయానికొస్తే .. పెర్త్ పట్టణంలోనే అత్యంత ఖరీదైన, నదీ తీరాన 6,600 చదరపు మీటర్ల వైశాల్యంలో నిర్మిస్తున్న దీని కోసం ఇప్పటికే 22 మిలియన్ డాలర్లు వరకు ఖర్చు చేశారు. ఇందులో ఒక దేవాలయం, జిమ్, స్విమ్మింగ్ పూల్, 17 కార్లను పార్క్ చేసే ఏర్పాట్లు ఉన్నాయి.