: కాల్ డేటా ముందు పెట్టి భూమనపై ప్రశ్నల వర్షం!
తుని విధ్వంసం కేసులో వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డిని రెండో రోజు సీఐడీ పోలీసుల బృందం విచారిస్తోంది. ఈ ఉదయం 11 గంటల సమయంలో గుంటూరు సీఐడీ కార్యాలయంలోకి భూమన వెళ్లగా, అప్పటి నుంచి విచారణ జరుగుతూనే ఉంది. తునిలో కాపు గర్జనకు కొద్ది రోజుల ముందు తిరుపతిలోని ఓ ప్రాంతంలో కొందరు కాపు నేతలతో సమావేశం నిర్వహించిన భూమన కాల్ డేటాను సేకరించిన సీఐడీ, దాన్ని ఆయన ముందు ఉంచి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు సమాచారం. కాపు నేతలకు ఎందుకు ఫోన్ చేశారు? ఏం మాట్లాడారు? వారి ఖాతాల్లోకి వచ్చిన డబ్బు వెనక భూమన పాత్ర తదితరాలకు సంబంధించి విచారిస్తున్నట్టు సీఐడీ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ కేసులో భూమనకు వ్యతిరేకంగా గట్టి సాక్ష్యాలే ఉన్నట్టు తెలుస్తుండటంతో ఆయన్ను అరెస్ట్ చేయవచ్చని భావిస్తున్నారు. అదే జరిగితే తీవ్ర ఉద్యమానికి తెరలేపాలని వైకాపా నిర్ణయించినట్టు సమాచారం.