: క్లైమాక్స్ చేరినట్టే చేరి... మొదటికి వచ్చిన హోదా/ప్యాకేజీ కథ!!
అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టే సందర్భంగా రాష్ట్రానికి పలు హామీలు ఇస్తూ, అంతకుమించి, ప్రత్యేక హోదాను ఇస్తామని చెబుతూ ఆశపెట్టి, ఇప్పుడు వాటిని తీర్చేందుకు మీనమేషాలు లెక్కిస్తున్న కేంద్ర ప్రభుత్వం మరోసారి ఏపీ ప్రజలను మోసం చేసే దిశగానే అడుగులు వేస్తోంది. గత వారం పది రోజులుగా, ఏపీకి ప్రత్యేక హోదాపై కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరదించేలా సంకేతాలు ఇస్తూ, హడావుడిగా కదిలిన బీజేపీ నేతలు, ఇప్పుడు మళ్లీ కథను మొదటికి తెచ్చారన్న భావన కనిపిస్తోంది. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు జరిపి, హోదా స్థానంలో అంతకన్నా ఎక్కువ లాభం కలిగించే ప్యాకేజీని తయారు చేశామని చెబుతూ, ఈ ఉదయం సీఎం చంద్రబాబునాయుడిని ఢిల్లీకి రావాలని ఆహ్వానించిన కేంద్రం, ఈ కథను క్లైమాక్స్ కు చేర్చినట్టే కనిపించింది. ప్యాకేజీలోని అంశాలను చంద్రబాబుకు వివరించి ఆయన అనుమతిని తీసుకోవాలన్నది కేంద్రం అభిమతం. అయితే, గత రెండు రోజులుగా వస్తున్న లీకులతో హోదా అంశాన్ని పూర్తిగా విస్మరించేందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని వైకాపా, కాంగ్రెస్ తదితర విపక్షాలు చేస్తున్న విమర్శలు, ఆపై ప్రజల్లో నెలకొన్న హోదా సెంటిమెంట్ కు ఎసరు పెడితే, తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని భావించిన చంద్రబాబు, ప్యాకేజీకి తాను వ్యతిరేకమని తేల్చి చెప్పారు. త్వరలో కార్పొరేషన్లు, మునిసిపల్ ఎన్నికలు జరగనున్న వేళ, ఈ సమయంలో హోదా రాలేదని తెలిస్తే, ప్రజల ఓట్లు అధికార పార్టీకి పడే అవకాశం ఉండదన్న అభిప్రాయాన్ని ఈ ఉదయం మంత్రులతో చంద్రబాబు జరిపిన సమావేశంలో టీడీపీ నేతలు వెలిబుచ్చారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక హోదాపై పట్టువీడకుండా చంద్రబాబు ఒకింత కటువుగానే వ్యాఖ్యలు చేసి తన మనసులోని భావాన్ని బయటపెట్టారు. ఆ వెంటనే కేంద్ర ప్రభుత్వం సైతం స్పందించింది. చంద్రబాబు అంగీకరించకుండా, తమకు తాము ప్యాకేజీపై ప్రకటన చేస్తే లాభం లేదన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. హోదా ప్రయోజలనాలన్నింటినీ కూర్చి ఓ ప్యాకేజిగా తయారుచేసినట్టు కేంద్రం చెబుతున్నా, దానిలోని వివరాలు తెలియకుండా తాను స్పందించబోనని చంద్రబాబు కరాఖండీగా చెప్పేశారు. ఢిల్లీకి వెళ్లేది కూడా లేదన్నారు. దీంతో కేంద్రం, తెలుగుదేశం పార్టీల మధ్య జరుగుతున్న హోదా/ప్యాకేజీ చర్చలు అర్థంతరంగా ముగిసినట్టేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు బీజేపీ మహిళా నేత పురందేశ్వరి హోదాపై నేడు ప్రకటన ఉండబోదని, ఒకటి రెండు రోజుల్లో జైట్లీ స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఏపీకి సాయంపై మాట్లాడతారని వ్యాఖ్యానించడంతో, ఈ వ్యవహారం తిరిగి మొదటికే వచ్చినట్లయింది.