: పురందేశ్వరిపై మీడియా ప్రశ్నల వర్షం... సూటిగా సమాధానం ఇవ్వలేకపోయిన బీజేపీ నేత
ఏపీకి ప్రత్యేక హోదా బదులు డెవలప్ మెంట్ ప్యాకేజీ పేరిట ఓ ప్రకటన చేసి చేతులు దులుపుకునేందుకు కేంద్రం యోచిస్తున్న వేళ, మీడియా ముందుకు వచ్చి బీజేపీ తరఫున మాట్లాడాలని యత్నించిన కేంద్ర మాజీ మంత్రి, మహిళా నేత పురందేశ్వరిపై ప్రశ్నల వర్షం కురిసింది. హోదాపై ఇచ్చిన హామీని ఎందుకు మరచిపోతున్నారని పత్రికా విలేకరులు, టీవీ చానల్స్ ప్రతినిధులు ప్రశ్నలు అడిగితే, ఆమె సూటిగా సమాధానం చెప్పలేకపోయారు. హోదాపై తిరుపతిలో నాడు ప్రకటన చేయలేదా? ఆర్థిక సంఘం సిఫార్సులతోనే మిగతా రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను ఇచ్చారా? ఎన్నికల మ్యానిఫెస్టో ఏమైంది? విశాఖపట్నానికి ఇవ్వాల్సిన రైల్వే జోన్ ను విజయవాడకు ఎందుకు తరలిస్తున్నారు? ఎంత సెంటిమెంట్ ఉంటే మేమిలా మిమ్మల్ని అడుగుతాం? ప్రజల తరఫునే ఈ ప్రశ్నలు వేస్తున్నాం... అంటూ మీడియా అడుగుతుంటే, నవ్వుతూనే తప్పించుకునే ప్రయత్నం చేశారు పురందేశ్వరి. తనకూ హోదాపై సెంటిమెంట్ ఉందని, ప్రజలను ఆందోళనపరిచే రాతలు, వ్యాఖ్యలు వద్దని, హోదా అన్న పదం లేకుండా అందుకు సమానమైన న్యాయం చేయాలన్నదే తమ ఉద్దేశమని చెప్పి మీడియా సమావేశాన్ని ఆమె ముగించారు.