: పవన్ కల్యాణ్ పై రోజా సెటైర్లు!... ఖాళీ సమయాల్లో పోరాడే వారు నాయకులు కాలేరని కామెంట్!
ఇటీవల తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో టాలీవుడ్ అగ్ర హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనపై విరిసిన వాగ్బాణాలకు వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆ వెంటనే స్పందించిన సంగతి విదితమే. నేటి ఉదయం మళ్లీ ఆమె పవన్ పై విమర్శలు గుప్పించారు. హైదరాబాదులోని లోటస్ పాండ్ లోని వైసీపీ కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశానికి హాజరైన ఆమె సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె పవన్ కల్యాణ్ పై సెటైర్లు సంధించారు. షూటింగ్ లేని సమయాల్లోనే పవన్ కల్యాణ్ కు ప్రత్యేక హోదా గుర్తుకు వచ్చిందని ఆమె ఎద్దేవా చేశారు. ఖాళీ సమయాల్లో ఉద్యమాలు చేసే వారు నాయకులు కాలేరని కూడా ఆమె పవన్ కల్యాణ్ కు చురకలంటించారు.