: క్యాంపు ఆఫీస్ కు చంద్రబాబు!... కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్న ఏపీ సీఎం!
ఏపీకి స్పెషల్ డెవలప్ మెంట్ ప్యాకేజీని కేంద్రం ప్రకటిస్తుందని భావిస్తున్న తరుణంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. నేటి కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్న ఆయన అందుబాటులో ఉన్న మంత్రులందరినీ తన వద్దకు పిలిపించుకున్నారు. కేంద్రం ఏం ప్రకటిస్తుందో చూడాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నేడంతా తన క్యాంపు కార్యాలయానికే పరిమితం కానున్నారు. నేటి ఉదయం వెలగపూడి సచివాలయానికి వెళ్లి అక్కడ ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో పాటు ఉపాధ్యయ దినోత్సవానికి సంబంధించిన కార్యక్రమంలోనూ ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే కేంద్రం నుంచి కీలక ప్రకటన రానున్న నేపథ్యంలో సదరు కార్యక్రమాలన్నింటినీ చంద్రబాబు రద్దు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాము ఆశించిన మేరకు కేంద్రం ప్రకటన లేకపోతే... ఎలా వ్యవహరించాలన్న అంశంపై నిర్ణయం తీసుకునేందుకే ఆయన తన కేబినెట్ మంత్రులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం.