: ఇది దేవసేన క‌థ కాదు ఓ చెట్టుక‌థ‌.. పాక్‌లో దశాబ్దాలుగా యావజ్జీవ శిక్షను అనుభ‌విస్తున్న చెట్టు!


‘బాహుబలి’ సినిమాలోని దేవసేన పాత్ర గొలుసుల‌తో బంధించ‌బ‌డి ద‌శాబ్దాలుగా శిక్ష‌ను అనుభ‌విస్తూ ఉంటుంది. అయితే అది సినిమా క‌థ.. పాకిస్థాన్‌లో ఓ చెట్టు శ‌తాబ్దాల‌ త‌ర‌బ‌డి శిక్ష‌ను అనుభ‌విస్తోందంటే న‌మ్ముతారా..? ఇది మాత్రం వాస్తవం! బలమైన ఇనుప గొలుసులతో బంధించబడి ఓ చెట్టు 1898 నుంచి శిక్ష‌ను అనుభ‌విస్తూ ఉంది. ఆ దేశంలోని లాండీ కోటల్‌ ఆర్మీ కంటోన్మెంట్‌ ప్రాంతం లోపలికి వెళ్లి చూస్తే ఈ దృశ్యం క‌న‌బ‌డుతుంది. ఏ పాప‌మూ చేయ‌లేదు.. అయినా ఆ చెట్టు ఈ శిక్ష అనుభ‌వించాల్సి వ‌స్తోంది. గొలుసుల‌తో బంధించి ఈ చెట్టుకు ఈ క‌ఠిన శిక్ష‌ను ఎందుకు వేశారో తెలుసా? 1898లో ఆ దేశంలోని జేమ్స్‌ క్విడ్‌ అనే బ్రిటీషు ఆర్మీ అధికారి చ‌ర్య‌ కార‌ణంగా. జేమ్స్‌ క్విడ్ ఒక‌ రోజు రాత్రి త‌ప్ప‌తాగి అటుగా వ‌స్తూ ఈ మ‌ర్రిచెట్టుపైన పడ్డాడు. మ‌ద్యంతో మ‌తి ప‌నిచేయ‌ని ఆ అధికారి చెట్టే ఉద్దేశపూర్వకంగా తనకు హాని తలపెట్టిందని, అందుకే తాను ప‌డ్డాన‌ని భావించి అక్కడున్న సిబ్బందికి చెట్టుకి శిక్షవేయ‌మ‌ని ఆదేశించాడు. దానిని ఇనుప సంకెళ్లతో బంధించ‌మ‌ని ఆజ్ఞాపించాడు. సిబ్బంది ఆ అధికారి చెప్పిన ప‌నిని చేశారు. అంతేగాక‌, ఆ చెట్టు కొమ్మల్లో ఒక బోర్డును వేలాడదీసి ఆ చెట్టు ఖైదు చేయబడిందిగా ఆ అధికారి రాయించాడు. బోర్డుపై ‘అధికారి క్విడ్‌ నన్ను అరెస్ట్‌ చేశాడు’ అనే చెట్టు చెబుతున్నట్లు సందేశం కనపడుతుంది. ఈ చెట్టు అక్క‌డి నుంచి ఎక్కడికైనా పారిపోతుందనే ఉద్దేశంతో ఆ అధికారి ఇలా రాయించాడ‌ట‌. ఇదీ ఈ చెట్టు క‌థ! నాడు ఆ అధికారి వేసిన శిక్ష‌ను నేటివరకు అనుభ‌విస్తూనే ఉంది ఆ మర్రిచెట్టు. చెట్టుని శిక్ష నుంచి విడిపించాల‌ని స్థానికులు ఎన్నో ప్రయత్నాలు చేసినా వారి ప్ర‌య‌త్నాల‌న్నీ విఫ‌ల‌మ‌య్యాయి. దాన్ని విడిపించ‌డానికి పోరాడిన ఓ స్థానికుడికి అధికారులు ఆ చెట్టుకు విధించిన శిక్షలాంటి శిక్షే వేశారు. అయితే, 2008లో నాటి పాకిస్థాన్‌ ప్రధాని శిక్ష అనుభ‌విస్తోన్న ఈ చెట్టుకు బెయిల్‌ ఇవ్వాలని అనుకున్నారు. దానిని శిక్ష నుంచి విడిపించాల‌ని భావించారు. దాని కోసం ఆజ్ఞలు జారీ చేసినా ఆ ఆజ్ఞ‌లు కార్యరూపం దాల్చల్చిన పాపాన పోలేదు. 2011లోనూ దాన్ని విడిపించాల‌ని అధికారులు ప్ర‌య‌త్నించారు. అయినా విమోచన కలగలేదు. దానికి కారణం లేక‌పోలేదు. అప్ప‌టి బ్రిటీషు చట్టమ‌యిన‌ ఫ్రాంటీయర్‌ క్రైమ్స్‌ రెగ్యులేషన్‌ చట్టం ప్రకారం ఈ చెట్టు శిక్ష అనుభ‌విస్తోంది. వాయవ్య పాకిస్థాన్‌లో ఉండే గిరిజనులను శిక్షించడానికి ఫ్రాంటీయర్‌ క్రైమ్స్‌ రెగ్యులేషన్‌ చట్టం ప్ర‌యోగించేవారు. ఈ చ‌ట్టం నేటికీ ఆ ప్రాంతంలో అమలులో ఉంది. చట్టానికి లోబ‌డే వ్య‌వ‌హ‌రించాలి క‌దా! దీంతో వేసిన శిక్ష‌నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేక చెట్టు శిక్ష అనుభ‌విస్తూనే ఉంది.

  • Loading...

More Telugu News