: సరికొత్త రికార్డు... 65 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్స్ లతో 145 పరుగులు బాదిన మాక్స్ వెల్


ప్రపంచ టీ-20 పోటీల్లో సరికొత్త రికార్డు నమోదైంది. శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య పల్లికెలెలో జరిగిన తొలి టీ-20లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాలో ఓపెనర్ జీజే మ్యాక్స్ వెల్ రెచ్చిపోయాడు. కేవలం 65 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్స్ లతో విరుచుకుపడి 145 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 263 పరుగుల భారీ స్కోరును ఆస్ట్రేలియా చేయగా, దాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక, 178 పరుగులకే పరిమితమైంది. లంక ఆటగాళ్లలో చండిమాల్ (58), కపుడెగర (43) తప్ప మరెవరూ రాణించలేదు. ఈ మ్యాచ్ తో ఓపెనర్ గా దిగి ఆడిన తొలి మ్యాచ్ లోనే సెంచరీ సాధించిన ఆటగాడిగా మ్యాక్స్ వెల్ నిలిచాడు. టీ-20ల్లో ఆస్ట్రేలియాకు ఇదే అతిపెద్ద స్కోరు. 2013 ఐపీఎల్ పోటీల్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పుణె వారియర్స్ పై 263 పరుగులు చేయగా, ఇప్పుడు ఆస్ట్రేలియా దాన్ని సమం చేసింది. రెండు దేశాల మధ్య జరిగిన పోరులో ఈ స్కోరే అత్యధికం కాగా, వ్యక్తిగత అత్యధిక పరుగుల రికార్డును మాత్రం మ్యాక్స్ వెల్ తాకలేకపోయాడు. 2013లోనే ఇంగ్లండ్ తో సౌతాంప్టన్ లో జరిగిన టీ-20లో ఆస్ట్రేలియాకు చెందిన ఏజే ఫించ్ 63 బంతుల్లో 156 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News