: జోడీ మారింది, సానియా ఓడింది... యూఎస్ ఓపెన్ నుంచి ఇంటికి
స్విస్ టెన్నిస్ దిగ్గజం మార్టినా హింగిస్ తో రెండేళ్ల క్రితం జోడీ కట్టి అప్రతిహతంగా దూసుకెళ్లి, మహిళల డబుల్స్ విభాగంలో నంబర్ వన్ స్థానంలో నిలిచిన సానియా మీర్జాకు హింగిస్ తో భాగస్వామ్యాన్ని వద్దనుకున్న తరువాత కలిసిరావడం లేదు. చెక్ రిపబ్లిక్ కు చెందిన బార్బరా స్టిక్రోవాతో జతకట్టి యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ ఆడుతున్న సానియా ఫ్రెంచ్ క్రీడాకారిణుల చేతిలో దారుణంగా ఓడిపోయింది. గత రాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో కరోలిన్ గార్సికా, క్రిస్టినా మ్లడెనోవిక్ చేతిలో 7-6, 6-1 తేడాతో సానియా జోడీ ఓటమి పాలైంది. కాగా, యూఎస్ ఓపెన్ పోటీలు ప్రారంభమైన తరువాత మూడు రౌండ్లలో కనీసం ఒక్క సెట్ కూడా కోల్పోకుండా గెలుస్తూ క్వార్టర్ ఫైనల్స్ కు చేరిన సానియా జోడి, ఈ ఓటమితో ఇంటిదారి పట్టింది. హింగిస్ తో తెగతెంపులు చేసుకున్న తరువాత సానియా ఆడిన తొలి గ్రాండ్ స్లామ్ ఇదే కావడం గమనార్హం.