: నాబార్డు నిధులతో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: హరీష్ రావు


నాబార్డు నిధులతో తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, నాబార్డుతో ఒప్పందం తెలంగాణకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 11 ప్రాజెక్టులతో పాటు, మొత్తం 99 ప్రాజెక్టులపై కేంద్రంతో ఒప్పందం చేసుకున్నామని ఆయన చెప్పారు. మొత్తం 11 ప్రాజెక్టులకు 7 వేల కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపామని ఆయన తెలిపారు. రెండు వేల కోట్ల రూపాయలను గ్రాంట్ల రూపంలో ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని ఆయన చెప్పారు. సెప్టెంబర్ చివరికల్లా తెలంగాణ ప్రాజెక్టులకు నిధులు విడుదల చేస్తామని కేంద్ర మంత్రి ఉమాభారతి హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు. పోతిరెడ్డిపాడు నీటి వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని ఆయన ఆరోపించారు. మిషన్ కాకతీయకు ట్రిపుల్ ఆర్ ద్వారా నిధులు కేటాయించాలని కోరామని ఆయన చెప్పారు. అలాగే తెలంగాణలోని కోల్డ్ స్టోరేజీల కోసం ప్రతిపాదనలు పంపామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News