: శనికి చీర, జాకెట్టు కడితే అది రోజా అవుతుంది!: ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు
చిత్తూరు నగరి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ మహిళా నేత రోజాపై విజయవాడ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, 'శనికి చీర, జాకెట్టు కడితే అది రోజా అవుతుందని' అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజాది ఐరెన్ లెగ్ అని ఆయన అన్నారు. ఆమె తమ పార్టీలోకి రావడం వల్లే అప్పట్లో ప్రతిపక్షానికి పరిమితమయ్యామని ఆయన పేర్కొన్నారు. తమ పార్టీ నుంచి ఆమె కాంగ్రెస్ లోకి వెళ్లగానే వైఎస్ ప్రాణాలు కోల్పోయారని, జగన్ జైలుకెళ్లాడని ఆయన అన్నారు. బీష్ముడిపై శిఖండిని వదిలినట్టు చంద్రబాబుపై విమర్శలకు రోజాను జగన్ వదిలాడని ఆయన ఆరోపించారు. కుటిల రాజకీయాలకు మహిళలను జగన్ వాడుకుంటున్నాడని ఆయన మండిపడ్డారు. ఇలా చేస్తే తాము చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు.