: మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, బదనాం చేయాలనే కుట్ర ఇది!: నిప్పులు చెరిగిన భూమన
తుని ఘటనతో ఏ మాత్రం సంబంధంలేని తనకు నోటీసులిచ్చి విచారణ చేయించడం చంద్రబాబు ప్రభుత్వ తీరుకు నిదర్శనమని వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. గుంటూరులో సీఐడీ విచారణ ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం తమను ఇబ్బంది పెట్టాలని, బదనాం చేయాలన్న లక్ష్యంతో సీఐడీ విచారణ జరిపారని అన్నారు. అయితే బాబు బెదిరింపులకు భయపడేది లేదని ఆయన చెప్పారు. తమపై అప్రజాస్వామిక పద్ధతులు ప్రయోగించినా బెదిరే ప్రసక్తి లేదని ఆయన తెలిపారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో గిరిజనులను ఏరివేసిన బ్రిటిష్ అధికారి రూధర్ ఫర్డ్ లా కాపు కులాన్ని అణచివేసేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. 'చంద్రబాబు, కాపుల సంబంధం' పాము, కప్ప సంబంధమని అన్నారు. ఎప్పటికైనా పాము కప్పను మింగాలని చూస్తుందని ఆయన తెలిపారు. కేవలం జగన్ ను బదనాం చేయడానికే తమపై బురదజల్లుతున్నారని ఆయన ఆరోపించారు. రేపు కూడా విచారణకు సీఐడీ అధికారులు రమ్మన్నారని, రేపు విచారణకు హాజరవుతానని ఆయన తెలిపారు. గుర్రం తోకకు ఎన్ని వెంట్రుకలున్నాయి? చెన్నై మెరీనా బీచ్ లో ఇసుక రేణువులెన్ని? ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎంత సారాయి తాగాడు? అని అడిగితే ఎలాంటి సమాధానం వస్తుందో... తుని ఘటనలో తన సంబంధంపై సమాధానం అదేనని ఆయన చెప్పారు.