: దసరా నుంచే కొత్త జిల్లాలు ప్రారంభం కావాలి.. కీలక సూచనలు చేసిన సీఎం కేసీఆర్
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా ముందుకు కదులుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులకు కీలక సూచనలు చేశారు. సామాజిక, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా పరిపాలన విభాగాలు ఉండాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 75 మండలాల ఏర్పాటుకు డిమాండ్లు వచ్చాయని, వాటిల్లో 45 మండలాలను నోటిఫై చేసినట్లు పేర్కొన్నారు. 35వేల జనాభా నిబంధనను అటవీ ప్రాంతాలకు, చెంచులకు సడలించాలని అధికారులకు కేసీఆర్ సూచించారు. వచ్చే దసరా నుంచి కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు ప్రారంభం కావాలని చెప్పారు. ఏర్పాటు చేయనున్న కొత్త జిల్లాల్లో పనిభారానికి తగ్గట్టు ప్రభుత్వ పరిపాలనా విభాగాలు ఉండాలని కేసీఆర్ పేర్కొన్నారు. వాటిల్లో అధికారుల సర్దుబాట్లు జరగడంతో పాటు కొత్త ఉద్యోగుల నియామకాలు ఉంటాయని తెలిపారు. కొత్త జిల్లాలు ప్రారంభమైన తర్వాతి రోజు నుంచే జిల్లాల్లోని రెవెన్యూ, పోలీసు శాఖల పని కూడా ప్రారంభం కావాలని కేసీఆర్ సూచించారు. రెవెన్యూ, పోలీసు మినహా మిగిలిన శాఖల ఆఫీసులు, అధికారుల నియామకం ఆ తర్వాత చేపట్టాలని పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలు, అధికారుల నివేదిక ఆధారంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు కావాలని సూచించారు. పరిపాలనకు సౌలభ్యంగా ఉండేట్లు వాటి ఏర్పాట్లు ఉండాలని చెప్పారు.