: ఉత్తరప్రదేశ్‌లో రాహుల్ సభలో కుర్చీలకు బదులు మంచాలు... తలొకటీ తీసుకెళ్లిన ప్రజలు
ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా జిల్లాలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలోని రుద్రాపూర్‌లో ‘ఖాట్‌సభ’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభలో రైతులు కూర్చోవడానికి కుర్చీలకు బదులుగా 2వేల కొత్త నులక మంచాలు వేశారు. అయితే, సభ అనంతరం అక్కడికి వచ్చిన వారంతా ఆ మంచాలను తీసుకెళ్లిపోయారు. ఈ దృశ్యాలు మీడియాకు చిక్కడంతో, ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. రాహుల్ గాంధీ రుద్రాపూర్ నుంచి ఢిల్లీ వరకు 2500 కిలోమీటర్ల మహాయాత్రను ప్రారంభించారు. తన యాత్రను రాహుల్ గాంధీ 30 రోజులు కొనసాగించనున్నారు. యాత్రలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని 223 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు. రైతులతో భేటీ అయి వారి సమస్యలను తెలుసుకుంటారు. ఈ సందర్భంగా రుద్రాపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ రైతులను మర్చిపోయారని ఆయన విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గతంలో మోదీ ఎన్డీఏ అధికారంలోకి వస్తే రైతుల అభివృద్ధికి తోడ్పడతానని వ్యాఖ్యలు చేసి ఇప్పుడు రైతుల పట్ల నిర్లక్ష్యధోరణి కనబరుస్తున్నారని రాహుల్ అన్నారు.