: తమిళనాడు నుంచి కర్ణాటకకు బస్సు సర్వీసులు రద్దు.. కొనసాగుతున్న ఉద్రిక్తత
తమిళనాడుకు కావేరి జలాలివ్వాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పిన నేపథ్యంలో కర్ణాటకలో నిరసనలు వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. దీంతో ఆందోళనకారులు బస్సులపై దాడి చేసే ప్రమాదం ఉందనే హెచ్చరికలతో తమిళనాడు నుంచి కర్ణాటకకు బస్సు సర్వీసులను రద్దు చేస్తూ జయలలిత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో తమిళనాడులోని వివిధ బస్ స్టేషన్ల నుంచి కర్ణాటకకు వెళ్లే అన్ని రకాల బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. ఆ రాష్ట్ర రాజధాని చెన్నైలోని కోయంబేడు బస్టాండ్లో ప్రయాణికులు కనిపించడం లేదు. హోసూర్ సరిహద్దులో కొన్ని బస్సులు నిలిచిపోయాయి. మరోవైపు మాండ్యాలో బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. ఆందోళనలు విస్తరిస్తున్నాయి. న్యాయవాదులు కూడా రైతులకు మద్దతుగా నిరసనలో పాల్గొంటున్నారు. భారీ ర్యాలీ నిర్వహించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాలీలో కొంతమంది ఆందోళనకారులు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఫోటోలతో కూడిన పోస్టర్లను చింపివేయడం అలజడి రేపింది. మాండ్యాలో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. కావేరి జలాల వివాదంపై ఈరోజు సాయంత్రం అఖిలపక్ష భేటీకి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పిలుపునిచ్చారు.